సిరి ధాన్యాలు

కొర్రలు (foxtail millet):

కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి.

  • మధుమేహ వ్యాధిగ్రస్తులకిది మంచి ఆహారం. శరీరంలోని కొలెస్టరాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

  • కొర్రలలో అధిక పీచుపదార్థం , మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం భాస్వరంతో విటమిన్లు అధిక పాళ్ళలో ఉంటాయి కనుక చిన్న పిల్లలకు, గర్భిణీలకు మంచి ఆహారం.

  • ఉదర సంబంధ వ్యాధులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కడుపునొప్పి, మూత్రం పోసేటపుడు మంటగా ఉండటం, ఆకలిమాంద్యం, అతిసారం మొదలగు వ్యాధులకు ఔషధాహారం మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం.

  • పీచు పదార్థమధికంగా ఉండటం వలన మలబద్దకాన్ని అరికడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగి దుప్పటి కప్పుకుని పడుకుంటే జ్వరం తగ్గిపోతుందని పెద్దల అనుభవం. గుండెజబ్బులు, రక్తహీనత, ఊబకాయం , కీళ్ళవాతం, రక్తస్రావం, కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.

ఊదలు(Barnyard Millet) :

ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.

  • ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

  • ఉత్తరాఖండ్, నేపాల్ లో ఊదల ఆహారాన్ని గర్భిణీలకు బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు.

  • ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతలను సమస్థితిలో ఉంచుతుంది ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

  • శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహారం.

  • ఊదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహారం.జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేవులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేవులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహారం కాపాడుతుంది.