ఫాస్ట్‌పుడ్‌ తింటున్నారా.. జర జాగ్రత్త!

ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం:

ఫాస్ట్‌పుడ్‌ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్‌ తీసుకుంటే డిప్రెషన్‌ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి తగ్గాలంటే..

► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్‌సైజ్‌లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది.

►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతాయి. క‌నుక వీటిని త‌గ్గించుకోవాలంటే నిత్యం త‌గినంత స‌మ‌యం పాటు నిద్ర‌పోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.

►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది.